క్రికెట్ మ్యాచ్‌లలో కొన్ని సార్లు అంపైర్లు చేసే తప్పిదాలకు టీంలు బలవుతుంటాయి. ఆయా తప్పిదాల వల్ల ఒక్కోసారి మ్యాచ్‌ల ఫలితాలే మారిపోతుంటాయి. నిన్న పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ అంపైర్ తప్పిదం చోటు చేసుకుంది. దీని వల్ల పంజాబ్ అనవసరంగా ఒక గేమ్‌ను నష్టపోవాల్సి వచ్చింది.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిన్న ఢిల్లీతో ఆడిన మ్యాచ్‌లో లక్ష్య సాధనకు 10 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉంది. అదే సమయంలో పంజాబ్ ప్లేయర్ మయాంక్ అగర్వల్ ఓ ఫుల్‌టాస్ బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌కు తరలించాడు. 2 పరుగులు తీశారు. కానీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే మయాంక్ అగర్వాల్‌తోపాటు ఉన్న మరో బ్యాట్స్ మన్ క్రిస్ జోర్డాన్ పరుగు తీసేటప్పుడు తన బ్యాట్‌ను క్రీజులో పెట్టనట్లు అనిపించింది. కానీ రిప్లేలో చూస్తే అతను బ్యాట్‌ను క్రీజులో ఉంచినట్లు స్పష్టంగా కనిపించింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ ఆ విషయాన్ని థర్డ్ అంపైర్‌కు రివ్యూ ఇవ్వలేదు. తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు. బ్యాట్స్‌మెన్ 2 పరుగులు తీసినా 1 పరుగు మాత్రమే కౌంట్ అయినట్లు ఇచ్చాడు. దీంతో పంజాబ్ లక్ష్య ఛేదనలో మ్యాచ్‌ను టైగా ముగించాల్సి వచ్చింది. ఫలితంగా ఆడిన సూపర్ ఓవర్ లో ఢిల్లీ గెలుపొందింది.
In this shorter format where games constantly go down to the wire surely the third umpire has to intervene? https://t.co/E92pUvsemN
— Lisa Sthalekar (@sthalekar93) September 20, 2020
అదే ఆ 1 పరుగును అంపైర్ ఇచ్చి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వచ్చేది కాదు. పంజాబే గెలిచి ఉండేది. కానీ అంపైర్ చేసిన తప్పిదం వల్ల పంజాబ్ అనవసరంగా ఒక మ్యాచ్‌ను నష్టపోయింది. దీనిపై పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. తాను ఎంతో దూరం నుంచి వచ్చి 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి, 5 సార్లు కోవిడ్ టెస్టులు చేయించుకుని స్టేడియంకు మ్యాచ్ చూసేందుకు వస్తే.. ఆ 1 పరుగు సంఘటన తనను ఎంతగానో బాధించిందని ప్రీతి జింటా పేర్కొంది. అంత టెక్నాలజీ అందుబాటులో ఉండి కూడా దాన్ని మనం వినియోగించుకోలేకపోవడం కరెక్ట్ కాదని, ఫీల్డ్ అంపైర్ ఆ 1 పరుగు విషయంలో థర్డ్ అంపైర్ రివ్యూను కోరి ఉండాల్సిందని, థర్డ్ అంపైర్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొంది. ఈ మేరకు ప్రీతి జింటా ట్వీట్ చేసింది.
I travelled enthusiastically during a pandemic,did 6 days of Quarantine & 5covid tests with a smile but that one Short Run hit me hard. What’s the point of technology if it cannot be used? It’s time @BCCI introduces new rules.This cannot happen every year. #DCvKXIP @lionsdenkxip https://t.co/uNMXFJYfpe
— Preity G Zinta (@realpreityzinta) September 21, 2020
అయితే అంపైర్ చేసిన ఈ తప్పిదాన్ని కేవలం ప్రీతి జింటా మాత్రమే కాదు.. క్రికెట్ విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు, ఇతర నిపుణులు కూడా తప్పుబడుతున్నారు. బ్యాట్స్ మన్ పరుగు పూర్తి చేశాడో లేదో తెలుసుకునేందుకు ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ రివ్యూను తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయం ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ రూల్ బుక్ లో ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలో ఓ రూల్ పెడితే బాగుంటుందని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. మరి బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.