రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈనెల 26న నగరానికి విచ్చేస్తున్నారు. రాష్ట్రపతి రాక కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబవుతుంది. వారం రోజులపాటు ఇక్కడే బస చేస్తారు రాష్ట్రపతి. దీంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. విష సర్పాలు, కీటకాలు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
కోవిడ్ ఇతర కారణాల రీత్యా మూడేళ్ల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నివాసానికి రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్ లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి ఆలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామం అనంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇక ఈనెల 27న నారాయణగూడ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరుకానున్న నేపథ్యంలో ఆయా ఏర్పాట్లను ప్రత్యేక బృందాలు పరిశీలించాయి.