కరోనా సోకి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అక్కడి నుండి పరారయిన ఖైదీల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. గత నెల లో గాంధీ హాస్పిటల్ నుండి నలుగురు ఖైదీలు తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురు నిందితుల్లో సోమా సుందర్ ను నార్త్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్ నుండి తప్పించుకోవాలని జావిద్ ప్లాన్ చేశాడని. జావిద్ ప్లాన్ తో గాంధీ నుండి పరారయి ఒక ఆటో మాట్లాడుకుని శంషాబాద్ వెళ్ళినట్టు గుర్తించారు.
అక్కడి నుండి గుల్బర్గా కి వెళ్లిన నేరస్తులు, గుల్బర్గా లో సైతం బైక్ చోరీలు చేద్దామని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే జావిద్ ప్లాన్ తో ఏకీభవించని మరో ఖైదీ నరసింహ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే గుల్బర్గాలో సైతం బైక్ లను మిగతా నేరస్తులు సోమ సుందర్, ఆర్బాజ్, జవిద్ లు దొంగలించారు. అంతేకాదు కొద్ది రోజుల క్రితం కొట్టేసిన బైక్ లతో హైదరాబాద్ కు వచ్చిన సోమ సుందర్ వాటిని అమ్మేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సోమ సుందర్ ను అదుపులోకి తీసుకున్న నార్త్ జోన్ పోలీసులు, మిగతా నేరస్తుల గురించి సోమసుందర్ నుండి సమాచారం రాబడుతున్నారు. గుల్బర్గాలో ఉన్నట్టు తెలియడంతో ఆ ఇద్దరు ఖైదీల కోసం ప్రత్యేక టీమ్ లు గాలిస్తున్నాయి..