దేశంలోని ప్రైవేటు హాస్పిటల్స్‌కు కేంద్రం షాకిచ్చింది. ఇప్పటి వరకు కోవిడ్ టీకాలను సదరు హాస్పిటల్స్ నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేసేందుకు వీలుండేది. కానీ ఇకపై అలా కుదరదు. తమకు నెలకు ఎన్ని డోసులు కావాలో అన్ని డోసులను ఒక్కసారి ఆర్డర్ ఇవ్వాలి. ఇందుకు కేంద్రం కోవిన్ పోర్టల్‌ను ఉపయోగించనుంది. జూలై 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
జూలై 1 నుంచి దేశంలోని ప్రైవేటు హాస్పిటల్స్ వారు కోవిన్ పోర్టల్‌లో ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ (పీసీవీసీ)లుగా నమోదు చేసుకోవాలి. అందులో తమకు నెల రోజులకు కావల్సిన డోసులను ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టిన 3 రోజుల్లోగా డబ్బును డిజిటల్ విధానంలో చెల్లించాలి. దీంతో హాస్పిటల్స్ కు కేంద్రమే డోసులను సరఫరా చేస్తుంది. వారు పెట్టుకునే ఆర్డర్లకు గరిష్టంగా 2 రెట్ల అదనపు డోసులను కేంద్రం అందిస్తుంది.
ఇక కోవిన్ పోర్టల్‌లో వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ పెట్టాక కేంద్రం అనుమతి ఇస్తుంది. దీంతో డోసులు సరఫరా అవుతాయి. దేశంలో పెద్ద ఎత్తున ప్రజలకు టీకాలను అందించాలని కేంద్రం భావిస్తోంది. చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు ఉన్నారు కనుక వారు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి టీకాలను కొనుగోలు చేయలేరు. మరోవైపు ప్రైవేటు హాస్పిటల్స్ నేరుగా కంపెనీల నుంచి టీకాలను కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తే పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా టీకాలు అందడం ఆలస్యం అవుతుంది. అందువల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.