కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2022లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 40 శాతం అసెంబ్లీ సీట్లను మహిళలకు కేటాయించనున్నట్లు వెల్లడించింది. మహిళల సాధికారతకే కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందని, దీనిలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం, ఎజెండా లేదని ఆమె అన్నారు. కులం, మతం ఆధారంగా కాకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయిస్తామని ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఇదే కాకుండా ఇటీవల జరిగిన లఖీంపూర్ ఖేరీ రైతు హత్యల గురించి ఆమె ప్రస్తావించారు. దురద్రుష్టవశాత్తు ఎవరైతే ఈ ఘటనకు కారణమయ్యారో… వాళ్లను కేంద్రం రక్షిస్తుందని విమర్శించారు. హత్రాస్, లఖీంపూర్ ఘటనలకు కారణమైన బీజేపీ నుంచి ఇంత కన్నా ఏం ఆశిస్తామని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో రానున్న ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని కాంగ్రెస్ అనుకుంటుంది. గతంలో 2017లో జరిగిన ఎన్నికల్లో 403 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీ 312 సీట్లను గెలుచుకుంటే, సమాజ్ వాదీ పార్టీ 47 సీట్లను, బీఎస్పీ 19 స్థానాలను, కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.