జీతం రాక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రాణం తీసుకున్న ప్రొఫెసర్‌

-

ఆయన ఒక ప్రొఫెసర్‌. ఎంతోమందికి ఉన్నతవిద్య అందించిన వ్యక్తి. ఆయన విద్యాబోధనలో తృప్తినే వెతుక్కున్నాడు తప్ప.. అధిక సంపాదన గురించి ఏనాడూ ఆలోచించలేదు. తనకొచ్చే నెల జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ సంతృప్తిగా గడిపేవాడు. అయితే గత 9 నెలలుగా తాను పనిచేస్తున్న సంస్థ జీతం ఇవ్వకపోవడంతో ఆయన కుటుంబ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇంతటి దయనీయ స్థితిలో చేసేదేమీ లేక ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. భార్యాబిడ్డలను దిక్కులేని వాళ్లను చేశాడు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉమారియా ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌ అనే ప్రొఫెసర్‌ స్థానికంగా ఉండే ఓ విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. అయితే ఈ మధ్య తాను పనిచసే సంస్థ దివాళ తీయడంతో 9 నెలలుగా జీతం రాలేదు. దీంతో కేవలం నెల జీతంపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆయన పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ఎప్పిటికైనా తన జీతం తనకు వస్తుందన్న నమ్మకంతో తెలిసినవారి దగ్గర అప్పులు తెస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. అయినా జీతం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ‘నా 9 నెలల జీతం, పీఎఫ్‌ డబ్బులు నా భార్యకు చెల్లించాలి’ అని లేఖ రాసిపెట్టి ప్రాణం తీసుకున్నాడు.

దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ సంజయ్‌కుమార్‌ భార్య భోరున విలపించింది. ‘మేం ఇన్నాళ్లు సంసారం ఎలా నెట్టుకొచ్చామో మాకు తెలుసు. జీతం వచ్చినన్ని రోజులు అంతా బాగానే ఉండేది. గత తొమ్మది నెలలుగా జీతం ఆగిపోవడంతో మా పరిస్థితి తిరగబడింది. ఫీజులు కట్టే పరిస్థితిలేక పిల్లలను స్కూళ్లకు పంపలేకపోయాం. ఇది చూడలేక ఆయన ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుంటా అని చెబుతుండేవాడు, నేను ధైర్యం చెబుతూ వచ్చేదాన్ని. కానీ సోమవారం నేను ఇంట్లోంచి బయటకు వెళ్లిన సమయం చూసి అన్నంత పనిచేశాడు’ అని విలపిస్తూ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news