భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 26న పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఓషన్‌శాట్-3 సహా ఎనిమిది నానో ఉపగ్రహాలను సీ-54 రాకెట్ కక్షలో ప్రవేశపెట్టనుంది.
ఈనెల 26న ఉదయం 11.56 గంటలకు ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఓషన్‌శాట్-3తో పాటు భూటాన్ శాట్, ఆనంద్, ధ్రువ స్పేస్ నుంచి రెండు టైబోల్ట్ శాటిలైట్లను, నాలుగు ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపనున్నట్లు వెల్లడించాయి. ఓషన్‌శాట్ భూ పరిశీలన ఉపగ్రహం కాగా.. ఇప్పటికే ఓషన్‌శాట్ సిరీస్‌లో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో మూడో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సముద్రం, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ.. తుఫానుల అంచనా వేయడానికి ఓషన్‌శాట్ సిరీస్ శాటిలైట్స్ ఉపయోగపడుతున్నాయి. ఇదే సిరీస్‌లో ఓషన్‌శాట్-3ఏ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాదిలో నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.