ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి. చంద్రయాన్-3 మిషన్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఇస్రో తన తదుపరి భారీ ప్రయోగానికి సంబంధించిన ఒక అప్‌డేట్ ఇచ్చింది.
ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న పిఎస్ఎల్వి సి –56 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. సింగపూర్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ ప్రధాన పేలోడ్ గా ఉండే కమర్షియల్ పీఎస్ ఎల్వీ మిషన్ లో..ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తరఫున ఏడు ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఇస్రో సోమవారం తెలిపింది.