కొన్ని కొన్ని విషయాలు చెవిన పడితే.. వాటి ఇంపార్టెన్స్‌ను బట్టి.. మన మనసులో ముద్ర వేసేసుకుంటాయి. ఎప్పుడు విన్నా మో.. ఎవరు చెప్పారో.. కూడా మనసు ప్రింట్ చేసేసుకుంటుంది. ఎన్నేళ్లయినా.. వాటిని మస్తిష్కం నుంచి చెరిపే అవకాశమే ఉండదు. అలాగే మన కళ్లు కూడా! కొన్ని కొన్ని దృశ్యాలను చూసినప్పుడు లేజర్ కిరణాలను రెటీనా.. ఆబగా మిగేస్తుంది.. తన ఐబ్యాంకులో నిక్షిప్తం చేసేసుకుంటుంది. ఎంత చూసినా.. చూడాలి.. చూడాలి.. అనేలా చేస్తుంది. ఇలాంటి దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు.. అంటారు అందుకే! ఇలాంటి దృశ్యమే విజయవాడలో చోటు చేసుకుంది. ఏం దృశ్యం.. ఏం దృశ్యం అంటూ.. ప్రజలు తమ మదిలో ముద్రవేసుకున్నారు.
ఔను.. దీనిని చూస్తే.. రెండు కళ్లూ చాలలేదు! అనే మాట తప్ప.. మరో మాటే వినిపించలేదు. నిన్న.. విజయవాడ వేదికగా సీఎం జగన్.. 108, 104 వాహనాలను ప్రారంభించారు. దాదాపు వెయ్యికి పైగా వాహనాలను ఒకేసారి పెరేడ్‌గా ప్రారంభించారు. బెజవాడ బెంజిసర్కిల్ వద్ద అత్యంత నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమం.. చూపరుల మదిలోనే కాదు.. సాధారణ ప్రజల మనసుల్లోనూ ముద్ర వేసుకుంది. పేదలకు నిరంతర వైద్యం క్షణాల్లో అందాలనే బృహత్తర లక్ష్యంతో జగన్ 104, 108 సేవలకు పునరుజ్జీవం కల్పించారు. వేల కోట్ల ఖర్చుతో తుప్పుపట్టిన వాహనాలను పక్కన పెట్టి పేదలకు సౌకర్యవంతమైన అధునాతన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమం బెజవాడలో ప్రారంభమైంది.
అయితే, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సాధారణ ప్రజలను ఎవరినీ అనుమతించలేదు. అదేసమయంలో ఎలాంటి ప్రసంగాలు, ఆర్భాటాలు కూడా లేవు. కొద్ది మంది సంబంధిత మంత్రులు, అధికారులతో ఈ కార్యక్రమాన్ని లాగించారు. అయితే, ఎంత నిరాడంబరంగా నిర్వహించినా.. డ్రోన్ కెమెరాలతో మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీసి సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాకు అందించారు. దీంతో అందరి ఫోన్లలోనూ ఈ వీడియో వైరల్ అయింది.