ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ కింద పలు లోన్లకు ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంట్ చార్జిలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. హోం, కార్ లోన్లు తీసుకునే కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే లోన్లు తీసుకున్న కస్టమర్లకు కూడా ఆయా చార్జిలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న 10,897 బ్రాంచిలు లేదా ఆన్‌లైన్‌లో కార్, హోం లోన్లను తీసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ బ్యాంక్ తెలిపింది. కాగా ఈ ఆఫర్ కింద కస్టమర్లు ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జిలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీని వల్ల కస్టమర్లకు హోం లోన్లపై 0.35 శాతం వరకు లేదా గరిష్టంగా రూ.15వేల వరకు చార్జిలు రద్దు అవుతాయి. అలాగే కార్ లోన్లపై 0.25 శాతం వరకు, ప్రాపర్టీ లోన్లపై రూ.1 లక్ష వరకు చార్జిలు ఆదా అవుతాయి.
కాగా సెప్టెంబర్ 1 నుంచి ఈ బ్యాంక్ ఇప్పటికే లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. హోం లోన్లు ఈ బ్యాంక్‌లో 7.10 శాతం వడ్డీకి లభిస్తుండగా, 7.55 శాతం వడ్డీని కార్ లోన్లపై వసూలు చేస్తున్నారు.