విభజిత ఏపీలో అతి పెద్ జిల్లా తూర్పుగోదావరి. ఈ జిల్లాలో మూడు ఎంపీ సీట్లతో పాటు 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీ కంచుకోటే. ఉద్దండులు అయిన నేతలు అందరూ ఇక్కడే ఉన్నారు. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిక్కాల రామచంద్రరావు, ఆదిరెడ్డి ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే నేతలకు కొదవే లేదు. మరి అలాంటి జిల్లాలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించుకుంటే చాలా అధ్వానంగా ఉందనే చెప్పాలి. ఏపీలోనే ఎక్కువ కరోనా కేసులు ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ టైంలో అధికార పార్టీపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన నేతలు కాడి కింద పడేసి చూస్తున్నారు.
యనమల అస్సలు ప్రజల్లోకే వెళ్లరు అన్న విమర్శలు ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఆయన అవుట్ డేటెడ్ నేత అయిపోయాడన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో ఎంపీలుగా ఓడిన ముగ్గురిలో కాకినాడ నేత చలమలశెట్టి సునీల్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక రాజమండ్రిలో ఓడిన మాగంటి రూపాదేవి రాజకీయాలకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక అమలాపురంలో ఓడిన బాలయోగి తనయుడు హరీష్ ఉన్నంతలో బెటర్. ఇక ఎమ్మెల్యేలుగా ఓడిన నేతల్లో రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు, ప్రత్తిపాడులో వరుపుల రాజా పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
చాలా నియోజకవర్గాల్లో ఓడిన వారంతా అసలు నియోజకవర్గాల్లోకే రావడం లేదు. ఉన్నంతలో పెద్దాపురంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే కాస్త యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ఆయన కూడా తన పనుల కోసం అధికార పార్టీ నేతలతో లలూచీ పడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా అధికార పార్టీ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన జిల్లా స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు.
ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు పార్టీలో ఉన్నారా ? అసలు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడేనా ? అన్న అనుమానాలు ఉన్నాయి. పార్టీ ఓడిపోయి యేడాదిన్నర కావొస్తున్నా ఇప్పటకీ కూడా ఆయన నోరు మెదపడం లేదు. ఇప్పటకి అయినా చంద్రబాబు తూర్పు గోదావరిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ తరపున పార్టీని నిలబెట్టే నాయకుడు లేక కనుమరుగు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.