మూడు రోజుల కస్టడీ తర్వాత సోమవారం అర్ధరాత్రి పుట్టమధును ఆయన ఇంటికి పంపించారు పోలీసులు. ఈ మూడు రోజులు చాలా లోతుగా విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన భార్య పుట్ట శైలజను కూడా విచారించారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. అయితే ఈ విచారణ సందర్భంగా పుట్ట మధు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు వామన్‌రావు దంపతుల హత్యకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వామన్‌రావుకు చాలా మంది శత్రువులు ఉన్నారని, అది అందరికీ తెలుసని వివరించారు. వామన్‌రావు మంథనిలో చాలామందిపై కేసులు పెట్టాడని తెలిపారు. ఇక కుంటశ్రీను, బిట్టు శ్రీనుపై కూడా వామన్‌రావు దంపతులు అనేక కేసులు వేశారని విరించారు.
ఆ వ్యక్తిగత కక్షతోనే వారు లాయర్ దంపతులను హత్య చేసి ఉండొచ్చని పుట్ట మధు అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయంలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి సమయంలోనైనా విచారణకు హాజరవుతానని వివరించినట్టు తెలుస్తోంది. అయితే తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఆయన పోలీసులను కోరినట్టు సమాచారం. ఇక ఈ రోజు కూడా అనూహ్యంగా మళ్లీ విచారణకు రమ్మని పోలీసులు ఆదేశించారు. అయితే పోలీసులు మాత్రం ఈ విచారణపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.