నాకు ప్రభాస్​ మధ్య రిలేషన్​ అదే: పీవీ సింధు

-

ఎంతోమంది సినీ ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న టాక్‌ షో.. ‘ఆలీతో సరదాగా’. అయితే ఈ వారం ఎపిసోడ్‌లో నాన్ ఫిల్మ్​ సెలబ్రిటీ, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అతిథిగా వచ్చేసి సందడి చేశారు. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తకిరమైన విశేషాలను ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇంకా ఆలీతో కలిసి బ్యాడ్మింటన్​ ఆడారు. మొత్తంగా ఇద్దరి సంభాషణలతో ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది.

టాలీవుడ్​లో ప్రభాస్‌ అంటే తనకిష్టమైన హీరో మంచి స్నేహితుడని, ఆలీ ఇష్టమైన కమెడియన్​ అని చెప్పారు. ‘సింధు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా?’ అని ప్రశ్నించగా.. “ఏమో.. నా బయోపిక్కే ఉండొచ్చేమో ఎవరికి తెలుసు?” అని నవ్వులు పూయించారు.

ఇప్పటి వరకూ తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని అన్నారు. ఇంట్లో వాళ్లందరూ ఆ ప్రేమ లేఖలు చదువుతారని చెప్పారు. గతంలో ఓ 70 ఏళ్ల వ్యక్తి ఇలాగే లేఖ రాశాడని, తనకిచ్చి పెళ్లి చేయకపోతే నన్ను కిడ్నాప్‌ చేస్తానని ఆ లేఖలో బెదిరించాడని సింధు చెప్పుకొచ్చారు.

“ఏదైనా పోటీల్లో గెలుపొంది పతకం తీసుకున్న సమయంలో అక్కడ మన జాతీయ గీతాన్ని వినిపిస్తుంటారు. ఆ క్షణం నాకెప్పుడూ కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ వినిపించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది” అని సింధు చెప్పుకొచ్చారు.

అనంతరం తన ఆట తీరుపై వచ్చిన విమర్శలపై ఆమె స్పందించారు. “నేను ఏదైనా పోటీలో విఫలమైనప్పుడు.. ‘ఎందుకలా ఆడుతున్నావ్‌? అంతకుముందు గేమ్‌లో ఆడినట్లు ఇక్కడ కూడా ఆడొచ్చు కదా’ అని చెబుతుంటారు. వాళ్ల మాటలు విన్నప్పుడు.. ‘నువ్వు వచ్చి ఆడు.. నీక్కూడా తెలుస్తుంది’ అని చెప్పాలనిపిస్తుంది’ అని సింధు అన్నారు. చివరగా ఓ ప్రముఖ అకాడమీ నుంచి బయటకు వెళ్లిపోవడంపై ఆమె మాట్లాడుతూ.. “అక్కడ నాకు కొన్ని విషయాలు నచ్చలేదు” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news