కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళ. తన ఇంట్లో ఉన్న 5 సీట్ సోఫా సెట్‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టింది. రూ.23,500 ధర చెల్లించాలని సూచిస్తూ యాడ్ పోస్ట్ చేసింది. దీంతో ఆ యాడ్‌ను చూసిన ఓ వ్యక్తి ఆమెకు కాల్ చేసి అదే ధరకు సోఫాను కొంటానన్నాడు. ఈ క్రమంలో సంతోషించిన ఆమె ఆ వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసింది. అయితే స్కాన్ సరిగ్గా అవడం లేదంటూ ఆ వ్యక్తి చెప్పడంతో ఆమె పలుమార్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తూ వెళ్లింది. ఈ క్రమంలో ఆమె అకౌంట్‌లో ఉన్న రూ.99,500 ఆ వ్యక్తి అకౌంట్‌లోకి వెళ్లిపోయాయి. విషయం గ్రహించిన ఆమె తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పైన తెలిపింది కేవలం ఒక్క బాధితురాలికి చెందిన విషయమే. నిజానికి ఈ ఏడాదిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 173 సైబర్ మోసాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. పైన తెలిపిన మహిళలాగే ఓఎల్ఎక్స్‌లో క్యూఆర్ కోడ్ మోసానికి ఇంకో వ్యక్తి రూ.57వేలు కోల్పోయాడు. ఈ క్రమంలో గత 2 వారాల నుంచి క్యూఆర్ కోడ్ మోసాలు పెరుగుతుండడంపై పోలీసులు హెచ్చరికలు చేశారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సాధారణంగా మనం ఎక్కడైనా సరే పేమెంట్ చేస్తేనే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తాం. అదే మనకు అవతలి వారు పేమెంట్ చేయాలంటే మన క్యూఆర్ కోడ్‌ను వారు స్కాన్ చేయాలి. కానీ మోసగాళ్లు ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. బాధితులను క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయాలని అడుగుతున్నారు. అయితే ఇంత చిన్న లాజిక్‌ను అర్థం చేసుకోలేక చాలా మంది వేలకు వేల రూపాయలను నష్టపోతున్నారు. కనుక పేమెంట్ చేయాలంటే కోడ్‌ను స్కాన్ చేయాలని, అదే పేమెంట్ తీసుకునేట్లయితే అవతలి వారే మీ కోడ్‌ను స్కాన్ చేయాలనే విషయాన్ని మీరు గ్రహించాలి. దీంతో ఇలాంటి మోసాలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. లాజిక్ అంతే..!