మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపుర్ మండలాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఉపఎన్నిక జరుగుతున్న ఈ రెండు మండలాల్లో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
“మునుగోడులో 35 సున్నిత ప్రాంతాలను గుర్తించాం. అలాంటి ప్రదేశాలలో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో బందోబస్త్ ఏర్పాటు చేశాం. మొత్తం ఎన్నికల్లో 2వేల మందితో భద్రతను ఏర్పాటు చేశాం. మొదటి సారిగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కేంద్ర బలగాలు ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం 9 మంది సిబ్బంది ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. చెక్‌పోస్టులు రేపు ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయి. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండ్ ఓవర్ చేశాం. ఇప్పటివరకు రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం”.- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ