జగనన్న ఆసరా పథకానికి విద్యుత్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ బాండ్లను కుదవ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 3,500 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఏపీ స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లకు సెబి సెక్యూరిటీ విజిలెన్స్ ఉంటుందని, అందుకే అప్పు పుట్టగతి అయ్యిందని, ఈ అప్పు తీర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరొకచోట అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.
ముఖ్యమంత్రి గారు చెప్పేదేమో రామరాజ్యం గురించే అయితే, చేసేదేమో రావణ రాజ్యంలో జరిగే పనులని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను ఇప్పటికే పలుమార్లు దారి మళ్లించారని, పేరుకేమో జగనన్న ఆసరా అయితే, నిధులు మాత్రం ఉద్యోగులవని, కనీసం విద్యుత్ ఉద్యోగుల ఆసరా అని చెప్పి ఉంటే వారికైనా క్రెడిబిలిటీ దక్కి ఉండేదని, సొమ్మేమో విద్యుత్ ఉద్యోగులదైతే, సోకు జగన్ మోహన్ రెడ్డి గారిది అని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. ఇలా చేయడానికి అసహ్యంగా లేదా?, అయినా రాష్ట్ర ప్రభుత్వం కంచే చేను మేసిన చందంగా వ్యవహరించడం దారుణమని అన్నారు.