కాశీ విశ్వనాధుని దర్శించుకున్న తాను రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకున్నట్లు రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. కాశీ కారిడార్ ను అనతి కాలంలోనే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఏపీసీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ఏమి చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి వివరిస్తూ లేఖ రాశారని అన్నారు.
గతంలో తాను అనేక మార్లు సునీల్ కుమార్ అవినీతి, అక్రమాలపై డిఓపిటి కార్యదర్శి గారికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాయడం జరిగిందని తెలిపారు. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సునీల్ కుమార్ ఏ విధంగా అక్రమ మార్గంలో నిధులు సేకరిస్తున్నారో సవివరంగా ఆ లేఖల ద్వారా వివరించినట్లు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, డిఓపిటి కార్యదర్శి గారికి లేఖలు రాశాననే అక్కసుతో సునీల్ కుమార్, ఢిల్లీలో కూర్చుని నాలుగు మంచి మాటలు చెబితే భరించలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తనపై కక్షపెంచుకొని తప్పుడు కేసులు బనాయించి, అరెస్ట్ చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారన్నారు. తాను ఢిల్లీలో కూర్చుని నాలుగు మంచి మాటలు చెబితే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నానని తనపై రాజ ద్రోహం కేసును నమోదు చేయించిన జగన్ మోహన్ రెడ్డి గారు, ఆ తరువాతే వై నాట్ 175 అని అన్నారని అటువంటప్పుడు తాను ఎలా ప్రభుత్వాన్ని కూల్చగలనని ప్రశ్నించారు. తాను ఇచ్చిన ఫిర్యాదులను పెడచెవిన పెట్టిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, న్యాయవాది లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన ఫిర్యాదుపైనైనా స్పందించడం అభినందనీయమన్నారు.
తాను ఫిర్యాదు చేసిన వాటిపై చర్యలు తీసుకోవడం నామోషీగా భావించిన జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు జరిపించి సునీల్ కుమార్ అవినీతి అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి తాను ఇచ్చిన ఫిర్యాదు కాపీలతో రాష్ట్ర డీజీపీ గారికి ఒక లేఖ రాయనున్నట్లు రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. డీజీపీ హోదా కలిగిన సునీల్ కుమార్ పై విచారణను రాష్ట్ర డీజీపీగా వ్యవహరిస్తున్న రాజేంద్రనాథ్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగుతుందని భావిస్తున్నానని, విచారణ అధికారిని తన వద్దకు పంపిస్తే పూర్తి వివరాలను అందజేసి సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. లాకప్ లో తనని చిత్రహింసలకు గురి చేసిన వారిలో ఎవరి పాత్ర ఏమిటో విచారణ అధికారికి వివరిస్తారని, విజయ్ పాల్ తో సహా ఇతరుల పాత్ర ఏమిటో కూడా చెబుతానని అన్నారు. ప్రభుత్వం తనపై కక్ష కట్టి రాష్ట్రానికి రానిచ్చే పరిస్థితి లేనందున, ఢిల్లీకి విచారణాధికారిని పంపించాలని కోరనున్నట్లు రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.