దళితులకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ కాంగ్రెస్సేనని ఒకప్పుడు డప్పు కొట్టి మరీ చెప్పేవారు ! ఆ డప్పు కొట్టేటోడు కూడా తమకే ఓటు వేస్తాడని కూడా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరువు హత్యకు సంబంధించిన ఉదంతంలో కాంగ్రెస్ నాయకులు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అదే ఇప్పుడు వార్తలలో నిలుస్తోంది. పార్టీ కోసం వచ్చిన వెళ్లిన యువ రాజుకు దళిత గొంతుకల బాధ వినిపించలేదా అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఓ విధంగా చూసుకుంటే ఈ తప్పు టీపీసీ వర్గలదా ? లేదా రాహుల్ గాంధీదా? ఎందుకంటే ఆయనకు ఈ విషయమై డైరెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు.. తెలంగాణ నేతలే కదా! మరి ! వాళ్ల ఆలోచన ఏమయింది ? ఆ వివరం ఈ కథనంలో..
తెలంగాణ వాకిట పర్యటించి కార్యకర్తలలో జోష్ నింపి వెళ్లారు యువ రాజు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో వరంగల్ కేంద్రంగా నిర్వహించిన సభ అనూహ్య రీతిలో సక్సెస్ అయింది. ఓ విధంగా రాహుల్ కన్నా ఈ సభ రేవంత్-కే అతి ముఖ్యమైంది. ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీలో రగులుతున్న అసమ్మతి సెగలను ఆపడం ఆయన వల్ల కూడా కావడం లేదు. ఆపడం కాదు కదా అడ్డుకోవడం కాదు కదా కనీస స్థాయిలో కూడా నిలువరించలేకపోతున్నారాయన.
ఈ దశలో రాహుల్ తనదైన పంథాలో వచ్చి మాట్లాడి వెళ్లారు. కాస్త పరిణితి పెంచి మాట్లాడారు కూడా ! ఆ విధంగా రైతు సంఘర్షణ సభ ఎవ్వరూ ఊహించని రీతిలో జనంలో మంచి గుర్తింపును అందుకుంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కలవరపాటుకు కారణం అవుతోంది. మరోవైపు రాహుల్ పర్యటన నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇక్కడ సంచలనం రేపిన పరువు హత్య ఘటనకు సంబంధించి ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్లడంపైనే విమర్శలు రేగుతున్నాయి. ఆయనే కాదు కాంగ్రెస్ కూడా ఆశించిన స్థాయిలో ఈ ఘటనపై తన వాయిస్ వినిపించలేకపోయింది. చనిపోయింది ఓ దళిత యువకుడు. మరి! ఈ ఘటనలో బాధితురాలి తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడాలి.. ఆయన కుటుంబం కోసం అండగా ఉండాలి కదా! ఇవేవీ చేయకుండా కాంగ్రెస్ ఎందుకని మౌనంగా ఉండిపోయింది? ఈ నేపథ్యంలో ఈ దిగువ మాటలు వినిపిస్తున్నాయి.
అరెస్ట్ అయిన లీడర్ల కోసం చంచల్‌గూడ జైల్ లోపలికి వెళ్ళిన రాహుల్ గాంధీ.. నాగరాజు కుటుంబాన్ని పరామర్శించలేకపోయా డు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఒదిలేసినట్టే అనుకోవచ్చా?.. ఇదీ ఓ సోషల్ మీడియా యాక్టివిస్టు మాట! నిజంగానే ఆయన పట్టించుకోలేదా లేదా పార్టీ వర్గాలు ఆయనకు ఆ విధంగా డైరెక్షన్ ఇవ్వలేదా ?