మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో జూన్ 2వ తేదీన రాహుల్ గాంధీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తేదీ మార్చాలంటూ దర్యాప్తు సంస్థను ఆయన కోరారు. దీంతో జూన్ 13వ తేదీకి విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి గత బుధవారం ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ మేరకు రాహుల్‌కు విచారణ కోసం జూన్ 2వ తేదీ, సోనియా గాంధీకి జూన్ 8వ తేదీని ఫిక్స్ చేసింది. రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వల్ల తేదీని వాయిదా వేయాలని ఈడీకి లేఖ రాశారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 13వ తేదీన ఢిల్లీలోకి ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని తెలిపింది. కాగా, మరోవైపు సోనియాగాంధీ ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం.