విశాఖ నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఏపీలో వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజులపాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు కోస్తా, రాయలసీమలో వర్షం పడతాయని వాతావారణ శాఖ తెలిపింది. వాయువ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 10న కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
ఇక తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్యకారులు వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని తెలిపింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల వాళ్లు పునరావాసాలకు వెళ్లాలని సూచించింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.