ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన విజయసాయి రెడ్డి… తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కోరారు. కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని నోటిఫై చేయాలని, ఆ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలానే ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. సీఎం జగన్, పార్టీ నేతలపై రఘురామ చేస్తున్న వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీలంతా కలిసి నిరసన తెలుపుతామన్నారు. స్పీకర్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏడాది గడుస్తున్నా అనర్హతపై నిర్ణయం తీసుకోలేదని, సుప్రీం తీర్పు ప్రకారం అనర్హతపై నిర్ణయం ఆలస్యం చేయకూడదని అన్నారు.