క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ మ్యాచ్ వచ్చేసింది. కానీ మొదటి రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. దీంతో నాలుగు రోజుల ఆట మిగిలి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ఒక రిజర్వ్ డేను కూడా అందుబాటులో ఉంచారు. కానీ మైదానం దగ్గర వాతావరణ పరిస్థితులను చూస్తే కేవలం 3 రోజుల పాటు మాత్రమే వాతావరణం అనుకూలిస్తుందని తేలింది. ఈ క్రమంలో మ్యాచ్ 4 ఇన్నింగ్స్‌లు జరుగుతాయ ? ఫలితం తేలుతుందా ? అనేది సందేహంగా మారింది.
అయితే వర్షం వల్ల ఇంకా రోజులను నష్టపోతే అప్పుడు న్యూజిలాండ్ కన్నా భారత్‌కే ఎక్కువ మ్యాచ్ అనుకూలించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత మ్యాచ్ లలో భారత బ్యాట్స్ మెన్ చాలా వేగంగా పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టు ఎదుట తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని నిలపడంలో విజయవంతం అయ్యారు. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఇక ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే ఏర్పడింది. మ్యాచ్ నిర్వహించేందుకు తక్కువ సమయం ఉంటుంది. దీంతో ఆటగాళ్లే వేగంగా, దూకుడుగా ఆడాలి. భారత్ ఈ విషయంలో గతంలో ఎన్నోసార్లు విజయం సాధించింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది కనుక కచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భారత్‌కు అనుకూలిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారుతుందని తెలుస్తుండడం, మ్యాచ్ నిర్వహణకు తక్కువ సమయం ఏర్పడనుండడం, వాతావరణ పరిస్థితులు మారడంతో భారత్ ఒక స్పిన్నర్‌ను తప్పించి ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాలని చూస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే మ్యాచ్‌లో ఆటగాళ్లు దూకుడును ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి భారత్ వ్యూహాలు ఈసారి సఫలం అవుతాయా ? యువ ఆటగాళ్లు ఏ మేర రాణిస్తారు ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.