ఏపీలో రెండు రోజుల పాటు ఒకటో నంబర్ హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ రోజు మధ్యాహ్నానికి శ్రీలంక ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం రేపు సాయంత్రం వరకు పశ్చిమ దిశగా పయనించి… ఆ తర్వాత దక్షిణ నైరుతిగా దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటనుంది.
ఈ నేపథ్యంలో ఏపీలోని నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం కారణంగా ఈదురు గాలులతో కూడిన వాతావరణం ఉంటున్నట్లు సమాచారం.