హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. అర్ధారాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఒక మాదిరి వర్షం పడింది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, మాదాపూర్, మాసబ్ ట్యాంక్, అమీటర్ పేట, మైత్రివనంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అటు వాతావరణం కూడా చల్లగా మారింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని పేర్కొంది.
రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, పరిసరప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ. నుంచి 2.1 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. దీంతో తెలంగాణపై ప్రభావం చూపుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడుతున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. పలుచోట్ల పిడిగుల పడే అవకాశం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రకటించారు.