ఆర్మీలో చేరాలని చాలా మంది యువత కలలు కంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర రక్షణ మంత్రి ‘ అగ్ని పథ్‘ స్కీమ్ ను తీసుకువచ్చారు. ఈ రోజు ఆర్మీ త్రివిధ దళాల అధిపతులతో రాజ్ నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్లు ఉన్న దాదాపు 45 వేల మంది యువతను నాలుగేళ్ల కాలానికి ఆర్మీలోని వివిధ సర్వీసుల్లోకి తీసుకోనున్నారు. 90 రోజుల్లో నియామకాాలు ప్రారంభం అవుతాయని.. 2023 జూలై వరకు తొలి బ్యాచ్ సిద్ధం అవుతుందని.. ఆన్ లైన్ ద్వారా నియామకాాలు చేపడుతామని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
ఈ స్కీమ్ ద్వారా ఆరునెలల శిక్షణ తరువాత 4 ఏళ్లు ఆర్మీ సర్వీసుల్లో పనిచేయనున్నారు. నెలకు రూ. 30 వేల-40 వేల వరకు జీతం రూపంలో పొందడమే కాకుండా ఇతర అలెవెన్సులు కూడా పొందవచ్చు. నాలుగేళ్ల తరువాత కేవలం 25 శాతం మంది మాత్రమే మరో 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ క్యాడర్ కింద సర్వీసుల్లో ఉండనున్నారు. మిగతా వారికి రూ.11 లక్షల-12 లక్షల ప్యాకేజీతో నిష్క్రమించనున్నారు. బీమాతో పాటు ఇతర అలవెన్సులను వారికి ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ సక్సెస్ అయితే డిఫెన్స్ బడ్జెట్ లో పెన్షన్ల రూపంలో 5.2 లక్షలు మిగిలే అవకాశం ఉందని.. ఈ నిధుల ద్వారా కొత్త ఆయుధాలు కొనేందుకు మార్గం సుగమం అవుతుందని ఆర్మీ భావిస్తోంది.