ఓల్డ్ సిటీలో రైడ్ కు వెళ్దామా..కేటీఆర్ కు రాజాసింగ్ స‌వాల్..!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి కేటీఆర్ కు స‌వాల్ విసిరారు. ఇద్దరం కలిసి ఒక్కసారి ఓల్డ్ సిటీలో ఒక్కసారి బైక్పై వెళ్లి వద్దాం అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటిలో మళ్లీ వర్షం పడుతుందని..చిన్న వాన పడితేనే బయటికి వెళ్ళలేని పరిస్థితి వ‌చ్చింద‌ని అన్నారు. చిన్న చిన్న నాళాలు సైతం పొంగిపొర్లుతున్నాయని రాజా సింగ్ అన్నారు. అసెంబ్లీలో మీరు మాటల్లో చెప్పింది… చేతల్లో కనబడడం లేదంటూ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఓల్డ్ సిటీ ని అభివృద్ధి చేశామని చాలా మాటలు చెబుతున్నారని… నిధులకు కరువు లేదని ముఖ్యమంత్రి చెబుతున్నారని రాజా సింగ్ అన్నారు. ఒక్కసారి ఓల్డ్ సిటీ లో తిరిగితే మీరు చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇద్దరం కలిసి బైక్ పైన తిరిగి వద్దాం..నేను వ్యక్తిగతంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కేటీఆర్ ను రాజా సింగ్ స‌వాల్ చేశారు. ఇదిలా ఉండ‌గా న‌గ‌రంలో మ‌ళ్లీ ఉద‌యం నుండి భారీ వ‌ర్షం కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్షాల‌తో ట్రాఫిక్ జామ్ సమ‌స్య‌తో పాటు లోత‌ట్టు ప్రాంతాల్లోకి నీరు చేర‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.