ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు రాజస్థాన్ రాయల్స్ కరోనాపై పోరాటానికి నడుం బిగించింది. ఫేస్‌బుక్ వేదికగా నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టింది. కరోనాపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థకు కావల్సిన నిధులను సేకరించేందుకు రాజస్థాన్ రాయల్స్ ముందుకు వచ్చింది.
రాజస్థాన్‌కు చెందిన ‘గ్రామ్ చేతన కేంద్ర’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఎంతో కాలంగా ఆ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి సాధికారతకు కృషి చేస్తోంది. వారికి పౌష్టికాహారాన్ని అందించేందుకు సహాయం చేస్తోంది. ఇప్పటి వరకు అలా ఎన్నో లక్షల మందికి ఆ సంస్థ చేయూతను అందించింది. అయితే ప్రస్తుతం కరోనాపై పోరాటం చేసేందుకు ఆ సంస్థ నడుం బిగించింది. అందుకు గాను ఆ సంస్థ విరాళాలను సేకరిస్తోంది.
ఇక ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సదరు స్వచ్ఛంద సంస్థకు నిధులను అందించేందుకు గాను ఏకంగా ఓ ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేసింది. దాంతో వచ్చిన విరాళాలను రాజస్థాన్ రాయల్స్ ఆ సంస్థకు అందజేయనుంది. దాతలు, ఐపీఎల్ రాజస్థాన్ జట్టు ఫ్యాన్స్ విరాళాలను అందజేయాలని ఆ జట్టు కోరుతోంది. https://www.facebook.com/donate/623879724831587/10163551866190080/ అనే సైట్‌ను సందర్శించి దాతలు రాజస్థాన్ రాయల్స్‌కు విరాళం పంపవచ్చు.