ఆలియాకు నేను అప్పుడే కనెక్ట్ అయ్యా..: రణ్​బీర్ కపూర్

-

అందమైన ప్రేమకథతో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు ఆలియాభట్‌- రణ్‌బీర్‌కపూర్‌లు. మూడుపార్ట్‌లుగా వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’లో జంటగా వినోదాన్ని పంచడానికి సిద్ధమైన వీళ్లు ఒకరి గురించి మరొకరు ఏం చెబుతున్నారంటే…

ఆలోచనలు ఒకటే

ఆలియా: చిన్నప్పుడు నాన్న బిజీగా ఉండటం వల్ల ఆయన్ని చాలా మిస్‌ అయ్యా. అందుకే నేను పెళ్లి చేసుకోబోయేవాడు మా నాన్నలా చూసుకోవాలని అనుకున్నా. ఆ విషయంలో రణ్‌బీర్‌కి నూటికి నూరుమార్కులు పడతాయి. తనూ నాలానే ఆలోచిస్తాడు.
రణ్‌బీర్‌: ఇద్దరం సినీ నేపథ్యం ఉన్నవాళ్లమే. మా ఇద్దరి తండ్రులూ బిజీగా ఉండటంతో అమ్మల సంరక్షణలో పెరిగాం. అందుకే నేను అలా ఉండకూడదనీ, పిల్లలతో వీలైనంత సమయం గడపాలనీ ఎప్పుడో నిర్ణయించుకున్నా. ఆలియా కూడా అలానే అనుకుంటుంది. ఇదనే కాదు, ఏ విషయంలోనైనా ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం.

తొలిచూపు…

ఆలియా: సంజయ్‌ లీలా భన్సాలీ దగ్గర రణ్‌బీర్‌ కొన్నిరోజులు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పుడే ‘బ్లాక్‌’ సినిమా కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్లా. అక్కడే రణ్‌బీర్‌కి పడిపోయా. అప్పుడు నా వయసు పదకొండేళ్లు. ‘సావరియా’లో చూశాక ఇంకా ఇష్టం పెరిగింది.

రణ్‌బీర్‌: మొదటిసారి ఆలియాతో మాట్లాడిన క్షణాలు నాకిప్పటికీ గుర్తే. ‘రాక్‌స్టార్‌’ విడుదలైనప్పుడు- ‘తనని ఎంతగా ఇష్టపడుతున్నావో రణ్‌బీర్‌కి చెప్పూ…’ అంటూ ఆలియాని నా దగ్గరకు తీసుకొచ్చాడు కరణ్‌జోహార్‌. ఆలియా నన్ను మొదటిసారి ఎప్పుడు చూసిందీ, ఎంతగా ఇష్టపడిందీ, ఎందుకు అభిమానిస్తుందీ… గడగడా చెప్పుకుంటూపోతుంటే అలా చూస్తుండిపోయా. అప్పుడే నేనూ తనకి కనెక్ట్‌ అయ్యా.

మర్చిపోలేని ప్రయాణం

ఆలియా: తరచూ షూటింగ్స్‌లోనూ, పలు కార్యక్రమాల్లోనూ కలిసే వాళ్లం. ఒకరిపై ఒకరికి మనసు నిండా ప్రేమున్నా ఆ విషయం మాత్రం పంచుకుంది లేదు. అయితే 2019లో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చిత్రీకరణ సమయంలో మేం మరింత దగ్గరయ్యాం. ఆ సినిమా వర్క్‌షాప్‌లో భాగంగా ఓ రోజు ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌కు విమానంలో బయల్దేరాం. ఆ సమయంలో రణ్‌బీర్‌ నా పక్క సీట్లోనే కూర్చున్నాడు. గమ్యం చేరేదాకా ఇద్దరం ఎన్నెన్నో మాట్లాడుకున్నాం. అప్పుడే తనకి నామీదున్న ప్రేమని పరోక్షంగా తెలిపాడు. మమ్మల్నీ, మా మనసుల్నీ దగ్గర చేసిన ఆ ప్రయాణం మాకో తీపి జ్ఞాపకం.

రణ్‌బీర్‌: తనకి ప్రపోజ్‌ చేసిన క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోవాలనుకున్నా. అందుకే గతేడాది ఆలియాకి ఇష్టమైన, ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటైన కెన్యాలోని మసాయ్‌ మారా నేషనల్‌ రిజర్వ్‌కి తీసుకెళ్లా. ప్రకృతి సాక్షిగా ఆ చిట్టడవి మధ్యలోనే ఆలియా వేలికి డైమండ్‌ రింగు తొడిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా…’ అని అడిగా. తన మనసులోని మాట నా పెదవి దాటే సరికి ఆలియా ఆనందానికి పట్టపగ్గాల్లేవు.

గౌరవించుకుంటూ…

ఆలియా: ఇద్దరం సినీ రంగంలోనే ఉండటంతో ఒకరి వృత్తిగత విషయాల్లో మరొకరం కల్పించుకోం. కలుస్తామన్న సమయానికి కలవలేకపోయినా పట్టించుకోం. ఒకర్నొకరం గౌరవించుకోవడం వల్లే ప్రతి చిన్న విషయాన్నీ అర్థం చేసుకోవడం కుదురుతుంది.

రణ్‌బీర్‌: ఆలియా షూటింగ్‌కి ఎక్కడికి వెళ్లినా, ఎన్నిరోజులు దూరంగా ఉన్నా నాకు పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ తనిప్పుడు గర్భిణిగా షూటింగ్‌ చేస్తుంటే బాధగా అనిపిస్తోంది. అందుకే ఈ మధ్య త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి ఇంటికొచ్చేయమని పోరుపెడుతున్నా.

హ్యాపీగా ఉన్నాం…

ఆలియా: రణ్‌బీర్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లయ్యాక ఆ బంధం మరింత బలపడటానికి పిల్లలూ దోహదం చేస్తారని అమ్మ చెబుతుండేది. అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పట్నుంచే పిల్లల గురించి ఆలోచించడం మొదలుపెట్టాం.

రణ్‌బీర్‌: తండ్రి కాబోతున్నానని తెలిసిన క్షణం కలిగిన సంతోషాన్ని అసలు వర్ణించలేను. పసి పిల్లల్ని ఎత్తుకోవాలంటే నాకు చాలా భయం. నా బిడ్డని తొలిసారి ధైర్యంగా ఎత్తుకోగలనా అనిపిస్తుంటుంది. అందుకే మా బంధువులూ, స్నేహితుల ఇళ్లలో ఉన్న పసిపిల్లల్ని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నా.

ఏం నచ్చుతాయంటే…

ఆలియా: ప్రేమలో పడిన వెంటనే రణ్‌బీర్‌ ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాడు. వాళ్ల అమ్మకీ, అక్కచెల్లెళ్లకీ నన్ను పరిచయం చేసి ఇంట్లో మనిషిగా చూడటం మొదలుపెట్టాడు. తక్కువ మాట్లాడతాడు. కల్మషం లేని వ్యక్తిత్వం. తను చాలా సీరియస్‌గా ఉంటాడని అందరూ అనుకుంటారుగానీ చాలా జోవియల్‌గా ఉంటాడు. బాగా జోకులు వేసి నవ్విస్తుంటాడు.

రణబీర్‌: నటి¨గా ఆలియా నాకు చాలా ఇష్టం. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ కోసం మూడునెలల్లో 18 కిలోలు తగ్గింది. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ పాత్రకు తగ్గట్టు తనని తాను మార్చుకుంటుంది. సరికొత్తగా మలుచుకుంటుంది. నిజజీవితంలోనూ అంతే. నేనేం కోరుకుంటానో చెప్పకుండానే అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా మారిపోతుంది. అందుకే ఆమెతో ఏడడుగులు వేశా.

Read more RELATED
Recommended to you

Latest news