జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనధికారికంగా వైసీపీలో చేరినట్టుగా ఆయన తాజా వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. వైసీపీకి వత్తాసు పలుకుతూ జనసేన ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్సార్ బాటలోనే జగన్ పయనిస్తున్నారని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో వ్యవసాయం దండగ అని అన్నారని, కానీ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం వ్యవసాయం అంటే ఓ పండుగ అని నిరూపించారని చెప్పారు.
ఇప్పుడు జగన్ కూడా అదే పనిచేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రాపాక వరప్రసాద్ రావు అన్నారు. వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో జగన్ ఉన్నారని ఆయన తెలిపారు. సభ జరగకూడదనే ఉద్దేశంతో టీడీపీ గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. ఏపీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా రాపాక మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.