మహిళపై అత్యాచారం.. బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆమె పోరాటం..!

-

27 ఏళ్ల కిందట ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. గర్భవతి కావడంతో తన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చి చెప్పాలని ఆమె పోరాటం ప్రారంభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్ జిల్లా సదర్ ప్రాంతంలో భార్యాభర్తలు ఉద్యోగం చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. వీరి వద్దే తమ బంధువులకు చెందిన 12 ఏళ్ల బాలిక ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలకు చేదోడు వాదోడుగా ఉంటుంది.

అత్యాచారం
అత్యాచారం

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను చూసిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరికొన్ని రోజుల తర్వాత మరో యువకుడు అసహాయతను అవకాశంగా మలచుకొని అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ బాలిక గర్భవతి అయింది. మగబిడ్డను కూడా జన్మనిచ్చింది. అయితే బాధితురాలి బంధువులు ఆ బిడ్డను మరొకరికి అప్పగించి.. ఆమెకు వివాహం చేశారు. అయితే బాధితురాలికి ఇదివరకే ఓ బిడ్డ పుట్టాడని తెలుసుకున్న భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోంది.

కాలం గడుస్తూ వస్తోంది. 27 ఏళ్లుగా ఆమె ఒంటరిగా బతుకుతోంది. ఆమెకు పుట్టిన పిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. అతడిని పెంచిన తల్లిదండ్రులు అసలు నిజం చెప్పడంతో తల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. తండ్రి ఎవరో చెప్పమని తన తల్లిని కోరాడు. అయితే ఈ విషయంపై ఆమెకు స్పష్టమైన అవగాహన లేదని, దీంతో తనపై అత్యాచారం చేసిన ఇద్దరిపై ఆమె పోలీసు కేసు పెట్టింది. తన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చి చెప్పాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ మేరకు పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇద్దరికీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి.. బిడ్డకు తన తండ్రి ఎవరో తేల్చి చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులు, బాధితురాలి కొడుకు రక్తనమూనాను సేకరించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. త్వరలో ఫలితాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news