Breaking : మంత్రి హామీతో సమ్మె విరమించిన రేషన్‌ డీలర్లు

-

చౌకధరల దుకాణాల డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. జూన్ 5 నుంచి రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రేషన్ డీలర్ల ఐకాసతో మంత్రి చర్చలు జరిపారు. రేషన్ డీలర్లు మొత్తం 22 అంశాలు ప్రభుత్వం ముందుంచగా.. 20 సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్ల ఐకాస ప్రకటించింది.

పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరవద్దని ఈ బాధ్యతను విస్మరించి రేషన్‌ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్‌ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరమన్నారు. రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మొత్తం 22 సమస్యలపై 20 సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని, గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు ఈ రెండు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు వినయ్‌ భాస్కర్‌, పద్మాదేవేందర్‌ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్‌ వీ.అనిల్‌కుమార్‌, జేఏసీ చైర్మన్‌ నాయికోటి రాజు, వైస్‌ ఛైర్మన్‌ బంతుల రమేష్‌బాబు, కన్వీనర్‌ దుమ్మాటి రవీందర్‌, కో`కన్వీనర్‌ గడ్డం మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news