డిజిటల్ వాలెట్ల పుణ్యమో.. ఆన్ లైన్‌లో నగదు లావాదేవీలు పెరగడమో.. తెలియదు కానీ.. ప్రస్తుతం బ్యాంకులు కస్టమర్లకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఆన్‌లైన్ లో ఏ విధంగా నగదు పంపినా చాలా వరకు ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతున్నాయి. దీంతో కస్టమర్ డబ్బులు రోజుల తరబడి ఇరుక్కుపోతున్నాయి. చేసేది లేక వారు కూడా డబ్బు మళ్లీ ఎప్పుడు రీఫండ్ అవుతుందా.. అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ ట్రాన్స్ ఫర్‌ను వాడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు బ్యాంకులు ఈ విషయంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి, కస్టమర్లను పట్టించుకోవడం లేదు.. కానీ ఇకపై అలా కుదరదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇక బ్యాంకులకు చుక్కలు చూపించే నిర్ణయం తీసుకోనుంది. జనవరి నుంచి నూతన విధానాన్ని ఆర్‌బీఐ ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్ పరంగా కస్టమర్లు ఇచ్చే ఒక్కో కంప్లెయింట్‌ను పరిష్కరించేందుకు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు సగటున రూ.3,145 ఖర్చవుతోంది. అయితే ఇకపై ఈ మొత్తాన్ని బ్యాంకులపైనే ఆర్‌బీఐ విధించనుంది. ఆ చార్జిలను ఇక బ్యాంకులే చెల్లించాలి.
కస్టమర్ల ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే బ్యాంకులు ఆ చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది. లేదా ఫిర్యాదులు రాకుండా సేవలను అయినా అందించాలి. ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తున్న నేపథ్యంలో సదరు లావాదేవీలు ఫెయిలైతే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ బ్యాంకులు పట్టించుకోవడంలేదు. ఇటీవలి కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ తోపాటు ఎస్‌బీఐ కూడా ఇలాంటి సమస్యలను విపరీతంగా ఎదుర్కొంటోంది. అయితే ఆర్‌బీఐ నిర్ణయం జనవరి నుంచి అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బ్యాంకుల నుంచి కస్టమర్లు మరింత నాణ్యమైన సేవలను ఆశించవచ్చు.