ఉత్తర కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవ పరేడ్‌లో మునుపెన్నడూ చూడని సంఘటన చోటుచేసుకుంది. పరమ క్రూరుడిగా, నియంతగా ముద్రపడిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన ప్రసంగం మధ్యలో కన్నీళ్లు పెట్టారు. తమ దేశ ప్రజల కష్టాల గురించి చెబుతున్నప్పుడు, సైనికులకు కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు కిమ్.
క్రూరుడిగా ముద్రపడిన కిమ్… తనకొచ్చిన చెడ్డ పేరును మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు… తన పాలనతో విసిగిపోయిన ప్రజలను కాస్త మంచి చేసుకునేందుకు కిమ్ అలా ప్రవర్తించి ఉండవచ్చనే అంచనా వేస్తున్నారు కొందరు నిపుణులు. అల్లకల్లోలంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి, పరిపాలన విషయంలో కిమ్‌పై నెలకొన్న ఒత్తిడికి కూడా ఆ కన్నీరు సూచిక కావచ్చన్నది ఇంకొందరి విశ్లేషణ.
స్వీయ రక్షణ కోసమే ఆయుధాలను సిద్ధం చేస్తున్నాం తప్ప… ఇతరులపై దాడి చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు కిమ్. అలాగే, ప్రసంగంలో ఎక్కడా అమెరికా గురించి ప్రస్తావించలేదు కిమ్. దాదాపు అరగంట సేపు ప్రసంగించిన కిమ్ జాంగ్ ఉన్‌కు… అర్ధరాత్రి చల్లటి వాతావరణంలో కూడా చెమటలు పట్టాయి.