తెలంగాణ ప్రభుత్వం ఆదాయ పెంపుపై దృష్టి సారించింది. ఇప్పటికే భూముల మార్కెట్ విలువలు, తెలంగాణ రిజిస్ట్రేషన్ చార్జీలు ( Telangana registration charges ) భారీగాపెంచింది. పెరిగిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టి సారించింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రెండు దశల్లో పూర్తిచేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే 15 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తిచేసి ఖజానాను నింపుకొనేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కరోనా వల్ల కోల్పోయిన ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ చార్జీలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా భర్తీ చేసుకొనేందుకు పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు 6శాతం నుంచి 7.5శాతానికి పెరిగాయి. ఇందులో స్టాంపు డ్యూటీ 5.5శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5శాతం ఉన్నాయి. కొత్త ధరలు, చార్జీల రూపేణా ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.3000కోట్ల ఆదాయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా. రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారు, ఫీజు చెల్లించిన వారు సైతం కొత్త చార్జీల మేరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చార్జీలు తమిళనాడులో 11శాతం, కేరళలో 10శాతం, ఏపీలో 7.5శాతం ఉన్నాయి. మరో తెలుగు రాష్ట్రంతో సమానంగా తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు.
కుటుంబ సభ్యులు, కుటుంబేతర సభ్యుల గిఫ్ట్ డీడ్ చార్జీలు కూడా పెరిగాయి. కుటుంబ సభ్యుల గిఫ్ట్ 2శాతం, కుటుంబేతర సభ్యుల గిఫ్ట్ డీడ్‌లు 5శాతానికి పెరిగాయి. అదే గ్రామ పంచాయతీ పరిధిలో కుటుంబ సభ్యులు 0.5శాతం + 0.5శాతం, కుటుంబేతర సభ్యుల మధ్య గిఫ్ట్ 1.5శాతం + 0.5శాతం లేదా కనిష్ఠంగా రూ.1000 గరిష్ఠంగా 10,000గా నిర్ణయించారు. పంచాయేతర పరిధిలో కుటుంబ సభ్యులు 0.5శాతం, కుటుంబేతర సభ్యుల మధ్య గిఫ్ట్ 0.5శాతం కనిష్ఠంగా రూ.1000 గరిష్ఠంగా 10,000గా నిర్ణయించారు.