కరోనా బారిన పడి హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న వారికి ప్లాస్మా థెరపీ అందిస్తున్న విషయం విదితమే. అయితే ఈ థెరపీ వల్ల కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని భావిస్తుండడంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది. అయితే త్వరలో రెమ్‌డెసివిర్‌ను కూడా కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి తొలగిస్తారని సమాచారం అందుతోంది.
గంగారామ్ హాస్పిటల్ చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమ్‌డెసివిర్ ఆశించిన మేర ఫలితాలను ఇవ్వడం లేదని, అందువల్ల రెమ్‌డెసివిర్‌ను కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి తొలగించే అవకాశం ఉందని అన్నారు. ప్లాస్మా థెరపీలో ఒకరిలో తయారయ్యే యాంటీ బాడీలను ఇంకొకరికి అందిస్తారు, దీంతో ఆ యాంటీ బాడీలు వైరస్‌తో పోరాడుతాయి. అయితే పలు సైంటిఫిక్ కారణాల వల్ల ప్లాస్మా థెరపీని నిలిపివేశారు. కానీ కోవిడ్ చికిత్సకు రెమ్‌డెసివిర్ పనిచేస్తుందని ఎలాంటి రుజువులు లేవని అన్నారు.
కోవిడ్ పై ఎలాంటి ప్రభావం చూపని మెడిసిన్లను వాడకపోవడమే మంచిదని డాక్టర్ డీఎస్ రాణా అన్నారు. ఇక ప్రస్తుతం కోవిడ్ చికిత్సకు పలు భిన్న రకాల మెడిసిన్లను వాడుతున్నారని అన్నారు. కాగా మన దేశంలో రెమ్‌డెసివిర్‌ను సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెటిరో, జుబిలంట్ ఫార్మా, మైలాన్, సింజీన్, జైడస్ కడిలా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటికి పేటెంట్ దారు గిలియాడ్ లైఫ్ సైన్సెస్ ఉత్పత్తికి అనుమతులు ఇచ్చింది.