రేణు దేశాయ్ ఇటీవలే గుంటూరు జిల్లాలో పర్యటించిన విషయం విదితమే. అందులో భాగంగా ఆమె ఆ జిల్లాలో ఉన్న రైతులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంది.
సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక.. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు దాని బారిన పడుతున్నారు. అభిమానులు, నెటిజన్లకు నచ్చని విధంగా ఏదైనా పని చేసినా, ఏదైనా పోస్టు చేసినా చాలు.. వారు సోషల్ మీడియాలో దాడికి గురవుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. దీంతో వారు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టాలో తెలియక, అసలు పోస్టులు పెట్టేందుకే వెనుకాడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుకు ఓ నెటిజన్ నుంచి అభ్యంతరకర రీతిలో కామెంట్‌ను ఎదుర్కొంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
రేణు దేశాయ్ ఇటీవలే గుంటూరు జిల్లాలో పర్యటించిన విషయం విదితమే. అందులో భాగంగా ఆమె ఆ జిల్లాలో ఉన్న రైతులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. అందులో భాగంగానే రేణు తన పర్యటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టూ చేస్తూ వచ్చింది. అయితే రేణు పెట్టిన ఓ పోస్టుకు ఓ యూజర్ అభ్యంతరకరంగా కామెంట్ చేశాడు. ”తనకు బాగా నవ్వొస్తుందని, తానొక రైతు బిడ్డనని, ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానని, మీలాంటి (బూతు పదం) వారు రైతుల కోసం ఏం చేశారని, డబ్బు కోసం మేకప్ వేసుకుని కెమెరా ముందు డ్రామాలు ఆడుతున్నారని..” అతను కామెంట్ చేశాడు. అయితే ఆ కామెంట్ పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రేణు అతనికి అంతే స్థాయిలో తనదైన శైలిలో ఘాటు రిప్లై కూడా ఇచ్చింది.
”సెలబ్రిటీలు అభిమానులను తిడితే దాన్ని వైరల్ చేస్తారు, అదొక పెద్ద విషయంగా మారుస్తారు. కానీ అభిమానులే సెలబ్రిటీలను తిడితే దాన్ని సాధారణంగా తీసుకుంటారు. ఎందుకిలా చేస్తున్నారు. మేం మాత్రం మనుషులం కామా.. మాకు భావోద్వేగాలు ఉండవా.. ఒక్కసారి ఆలోచించండి. మీ కామెంట్లకు మాకు ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోండి. నేను రైతులక ఏదో ఒక విధంగా సహాయం చేయాలని అనుకుంటుంటే మీరిలా కామెంట్ చేయడం సరికాదు. ఇలా ఊరు పేరు లేకుండా అనవసరంగా మమ్మల్ని విమర్శించే వారు.. సమాజానికి ఏదైనా మంచి పని చేస్తే బాగుంటుంది…” అంటూ రేణు కౌంటర్ ఇచ్చింది..! ఏది ఏమైనా.. ఇప్పుడీ పోస్టు మాత్రం నెట్‌లో వైరల్ అవుతోంది..!