కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మూతపడ్డ రెస్టారెంట్లు క్రమంగా తెరుచుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తుండడంతో అనేక కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల కొందరు వ్యాపారులు రెస్టారెంట్లను మళ్లీ ఓపెన్ చేశారు. అయితే ప్రస్తుతానికి కేవలం పార్శిల్ సర్వీసును మాత్రమే అందిస్తున్నారు.
ఇక రెస్టారెంట్లను ఓపెన్ చేసినప్పటికీ ప్రస్తుతానికి వినియోగదారులు తమ ఫేవరెట్ ఫుడ్‌ను కేవలం పార్శిల్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే కరోనా జాగ్రత్త చర్యలు పాటిస్తూనే.. రెస్టారెంట్లు కస్టమర్లకు టేక్ ఎవే ఆర్డర్లను అందివ్వనున్నాయి. ఈ క్రమంలో దాదాపుగా 50 రోజుల అనంతరం మళ్లీ భోజన ప్రియులకు తమకిష్టమైన ఫుడ్‌ను ఆరగించే అవకాశం దక్కింది.
అయితే దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 17వ తేదీతో ముగుస్తుండడంతో.. కేంద్రం లాక్‌డౌన్ 4.0 ను ప్రకటించడంతోపాటు రెస్టారెంట్లు, హోటల్స్‌కు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.