తెలంగాణ సాధించుకున్న తర్వాత ‘జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదిస్తామని అన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఐదు దశాబ్దాల పాటు మునుగోడు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమాలు, మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్ర అజెండా తదితర అంశాలపై నేతల సూచలను కోరారు. ఈ సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు 8యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయించాం. 300బూత్‌లను చూసుకోవడానికి 150 మందిని నియమించాలని పార్టీ భావిస్తోంది. ఇందులో అందరూ సమానమే.. చిన్న, పెద్ద తేడా ఏమీ లేదు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ అడ్డగోలుగా ధనబలాన్ని ఉపయోగిస్తాయి. మనం క్షేత్ర స్థాయిలో తెరాస, భాజపాను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి. ” – రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు