ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా చాలామంది నష్టపోయారని, వరదలతో ఇళ్లు కూలిపోయాయని, ఈ నేపథ్యంలో వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైందని, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అలాగే వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట చెప్పడం కాదని, కనీసం ఈ పరిస్థితుల్లో బయటకు రావాలంటే నగర ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి.
వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయని, దీంతో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది? ఎక్కడ గుంత ఉంది? తెలియక ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరగాల్సి వస్తోందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ను డల్లాస్, పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్భాలు పలికారని, కానీ వర్షాలకు రోడ్లు నీట మునిగాయన్నారు రేవంత్ రెడ్డి. భాగ్యనగరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమయం మంత్రిగా మీకు లేదా? అని ఆ లేఖలో కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించిందని, అయినా ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి.