రేవంత్ వన్ మ్యాన్ షో… ఆ సీనియర్లు అలకపాన్పు దిగరా?

-

రేవంత్ రెడ్డి తెలంగాణ పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ఆయన అధికార టి‌ఆర్‌ఎస్‌పై పోరాటం చేస్తూ, కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అటు దండోరా సభలని సక్సెస్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్‌లో మొత్తం రేవంత్…వన్ మ్యాన్ షో నడుస్తోందని చెప్పొచ్చు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అందుకే ఇంకా కొందరు సీనియర్లు అలకపాన్పు దిగుతున్నట్లు కనిపించడం లేదు. రేవంత్‌కు పి‌సి‌సి ఇవ్వడం తెలంగాణలో సీనియర్లకు నచ్చని విషయం తెలిసిందే. ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పేశారు. అయితే నిదానంగా రేవంత్, పలువురు సీనియర్లని తన దారిలోకి తెచ్చుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా గాంధీ భవన్‌కు దూరంగానే ఉంటున్నారు.

సీనియర్‌ నేతలు జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు రేవంత్ ఉన్నచోటకు అసలు రావడం లేదు. వారు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. ఇటు కాంగ్రెస్‌కు పెద్ద తలకాయలుగా ఉన్న మర్రి శశిధర్‌ రెడ్డి, కోదండరెడ్డి, వీహెచ్ లాంటి నాయకులు కూడా గాంధీ భవన్ వైపు చూడటం లేదు. అయితే తనకు కాకుండా రేవంత్‌కు పి‌సి‌సి ఇవ్వడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదట నుంచి గాంధీ భవన్‌కు దూరంగానే ఉంటున్నారు. అటు అన్న బాటలోనే రాజగోపాల్ రెడ్డి నడుస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి సైతం ఇంతవరకు రేవంత్‌ని కలవలేదు. అటు సీనియర్లు మర్రి, వి‌హెచ్, కోదండరెడ్డిలు అడ్రెస్ లేరు.

ఇక వారిని కలుపుకునే ప్రయత్నం కూడా రేవంత్ చేయడం లేదు. నాయకులని బుజ్జగించుకుంటూ ఉంటే పార్టీకి ఇబ్బంది అవుతుందని, పైగా ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేదని చెప్పి రేవంత్ దూకుడుగా ముందుకెళుతున్నారు. కానీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్న పార్టీకి సీనియర్ల అవసరం కూడా ఉందని కాంగ్రెస్‌లోని మరికొందరు మాట్లాడుతున్నారు. మరి ఆ సీనియర్లని రేవంత్ అలకపాన్పు మీద నుంచి ఎప్పుడు దించుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news