జనవరి నాటికి రామాలయం పూర్తి: ఏపీ మంత్రి

విజయనగరం: రామతీర్థంలోని శ్రీరాములవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రామతీర్థం కొండపై జనవరి నాటికి రాముల వారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు.  కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.  ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీ‌ల సూచనలు, సలహాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఈ  మేరకు శాస్త్రోక్తంగా రూ. 3 కోట్ల వ్యయంతో ఆలయాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మాణం చేస్తామని వెల్లంపల్లి తెలిపారు. చిలకలూరిపేట నుంచి రాతి పని వారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచి దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేశామన్నారు. దేవాలయాల్లో భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని మంత్రి వెలంపల్లి స్పష్టంచేశారు.