పొగాకు ఏ రూపంలో తీసుకున్నా హానికరమే. సిగరెట్ తాగినా, తంబాకు నమిలినా హాని కలిగేది ఆరోగ్యానికే. అందులో పొగాకు ఏ రూపంలోనూ మంచిది కాదు. అసలు పొగాకు ఎందుకు మానలేకపోతున్నారు? మానేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? మానేస్తే శరీరంలో వచ్చే మార్పులు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
పొగాకు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, పాంక్రియాస్, కిడ్నీ, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే పొగాకు మానేయాలి. ఐతే అది అంత ఈజీ కాదు. వ్యసనంగా మారిన అలవాటుని శరీరం అంత తేలికగా వదిలిపెట్టదు. అలవాటైన పనులు మానేయడం వల్ల శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
పొగాకు మానేయడం వల్ల మీ శరీరంలో వచ్చే మార్పులు..
ఇరవై నిమిషాల్లో
బీపీ సాధారణ స్థాయికి వస్తుంది.
పల్స్ రేట్ సాధారణ స్థాయికి దిగుతుంది.
శరీర ఉష్ణోగ్రతలు నార్మల్ స్థాయికి వస్తాయి.
8గంటల్లో
రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ సాధారణ స్థాయికి వస్తుంది.
రక్తంలో ఆక్సిజన్ శాతం సాధారణ స్థాయిలోకి వస్తుంది.
పొగరాయుళ్ళ నుండి వచ్చే శ్వాస సాధారణంగా ఉంటుంది.
24గంటల్లో
గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
48గంటల్లో
వాసన, రుచి చూడగలిగే సామర్థ్యం పెరుగుతుంది.
72గంటల్లో
ఊపిరితిత్తుల పనితీరు సక్రమంగా మారుతుంది. సాధారణ మానవుడి ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో ఆ విధంగా పనిచేయడం మొదలవుతుంది.
2వారాల నుండి 3నెలల్లో
రక్త ప్రసరణ పనితీరు మెరుగవుతుంది.
నడక సులభంగా ఉంటుంది.
ఊపిరితిత్తుల పనితీరు 30శాతం మెరుగ్గా అవుతుంది.
1 నుండి 9నెలల్లో
దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తగ్గుతాయి.
శక్తి పెరుగుతుంది.
ఒక సంవత్సరంలో
గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
పొగాకు మానేయడం వల్ల ఏ టైమ్ లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా.. అందుకే ఈవేళే పొగాకు మానేయండి.