పెట్రోల్, డీజిల్ ధరలు దేశం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా.. చేస్తున్నాయి. ఇప్ఫటికే ఆకాశాన్ని అంటిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడో సారి పెరిగాయి. ఈ రోజు లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, లీటర్ డీజిల్ పై 76 పైసలు పెంచుతూ దేశంలో ఉన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
దీంతో లీటర్ డీజిల్ ధర తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల రూ. 100 మార్క్ ను అందుకుంది. ఈ రోజు పెరిగిన ధరలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కి చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 99.83 కు చేరింది. రంగరెడ్డి జిల్లాలో లీటర్ డీజిల్ ధర ఏకంగా.. రూ. 100 మార్క్ ను అందుకుంది. అక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 100.03 గా ఉంది.