కరోనా నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వందల కోట్ల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఓ అధ్యయనం నిర్వహించింది. అందులో వెల్లడైందేమిటంటే.. రానున్న 5 ఏళ్ల కాలంలో కోవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 8.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలియజేసింది.
కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం అనేక కంపెనీలు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ తిరోగమన దిశలో ఉన్నందున నష్టాలు అధికంగా వస్తున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు కంపెనీలు ఇప్పటికే కాస్ట్ కటింగ్ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఉద్యోగులు అవసరం లేని చోట రోబోట్లను, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించి మరిన్ని ఉద్యోగాలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అదే జరిగితే భవిష్యత్తులో మనుషులకు బదులుగా రోబోట్లు, ఏఐ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది.
అయితే ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు నూతన స్కిల్స్ ను నేర్చుకోవాలని, ఇప్పటికే ఉన్న తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని డబ్ల్యూఈఎఫ్ అభిప్రాయపడింది. అయినప్పటికీ మిడ్ సైజ్డ్ ఉద్యోగులకే ఉద్యోగాలు కోల్పోయే రిస్క్ ఎక్కువగా ఉందని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేస్తోంది. అయితే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ కుప్పలుగా ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆ రంగంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటే తమ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. ఇక అమెరికా వంటి దేశాల్లో కరోనా నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళనకరంగా ఉందని డబ్ల్యూఈఎఫ్ అభిప్రాయపడింది.