వరుస విజయాలతో వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్, అతి నమ్మకమే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నారు. అతి నమ్మకం ఎక్కువైనపుడు ఆటగాళ్ల కళ్ళు నెత్తికెక్కుతాయని, అందువల్ల ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటారని తెలిపారు. భారత ఆటగాళ్లు కూడా వరుస విజయాలతో ఆసీస్ ను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నారని చెప్పాడు.
ఈ ఓటమితో భారత ఆటగాళ్ల గర్వం నేలకు దిగింది అన్నారు రవి శాస్త్రి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్టులో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బయట వ్యక్తులు చేసే చెత్త వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వాస్తవాలు మాట్లాడుకుంటే తొలి రెండు టెస్టుల్లో తాము గెలిచామని, బయట వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయని విమర్శించారు. ప్రతి మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చేందుకే తాము కృషి చేస్తామని చెప్పారు.