భారత లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ టీం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ రెండింటిలోనూ ఆడుతానని అన్నాడు. ఈ మేరకు రోహిత్ ఆదివారం తన అభిమానులతో ఇన్‌స్టాగ్రాంలో ముచ్చటించాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాడు. టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ రెండింటిలో.. ఏ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఇష్టపడతారు ? అని ఓ అభిమాని అడగ్గా.. రోహిత్ అందుకు సమాధానం చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌లు జరిగితే రెండింటిలోనూ తాను ఆడేందుకు సిద్ధమని రోహిత్ అన్నాడు. కాగా మార్చి 29 నుంచి జరగాల్సిన 13వ ఎడిషన్ ఐపీఎల్ కరోనా కారణంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా పడింది. ఆ తరువాత కూడా పరిస్థితి మారకపోవడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. కానీ సెప్టెంబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటోంది.
అయితే మరోవైపు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా.. ఆ టోర్నీ నిర్వహణ విషయంపై ఐసీసీ ఎటూ తేల్చలేదు. ఇటీవలే ఐసీసీ బోర్డు ప్రతినిధులు సమావేశమైనా ఆ నిర్ణయాన్ని జూలై వరకు వాయిదా వేశారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణ షెడ్యూల్ ఖరారు అయితే గానీ బీసీసీఐ ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోలేదు. దీంతో అటు ఐసీసీ, ఇటు బీసీసీఐ ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే ఈ ఏడాది ఎట్టి పరిస్థితిలోనూ ఐపీఎల్‌ను నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇదివరకే స్పష్టం చేశారు. అవసరం అయితే ఖాళీ స్టేడియాల్లోనైనా సరే మ్యాచులు నిర్వహిస్తామన్నారు. దీంతో బీసీసీఐ చేసే ఐపీఎల్ ప్రకటనపై క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.