ఆర్టీసీ ఆప‌రేష‌న్ స్టార్ట్ … స్పాట్ పెట్టేసిన కేసీఆర్‌

-

తెలంగాణ స‌ర్కారు ఆరేండ్ల పాల‌న‌లో సీఎం కేసీర్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సంఘ‌ట‌న ఏదైనా ఉందా అంటే ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేద‌నే స‌మాధానం వినిపిస్తుంది.. ఎందుకంటే కేసీఆర్ త‌న ప‌రిపాల‌న‌లో ఎక్క‌డా తిరుగుబాటు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతు, అవ‌స‌ర‌మైతే న‌యానో భ‌యానో ఒప్పించ‌డం.. లేదంటే పోలీసుల చేత అణిచివేయ‌డం జ‌రిగింది. అయితే కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అతిపెద్ద కుదుపు ఏదంటే ఆర్టీసీ కార్మికుల స‌మ్మే అని చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ పోరాటంలో చూపిన తెగువ‌ను ఇప్పుడు మ‌రోమారు త‌మ అస్థిత్వం కోసం చూపేందుకు సిద్ద‌మ‌య్యారు.

స‌మ్మె ద్వారా మా జీవితాల‌కు వెలుగు వ‌స్తాయ‌నే ఆశ‌తో ఆర్టీసీ కార్మికులు త‌మ ఉద్యోగాల‌ను ఫ‌ణంగా పెట్టి మ‌రి స‌మ్మె బాట ప‌ట్టారు. తెలంగాణ స‌మాజం ద‌స‌రా పండుగ వేళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఆర్టీసీ కార్మికుల‌కు అండ‌గానే ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ స‌మ్మెను బెదిరించి విమ‌రించేలా చేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం చెందాయి. స‌మ్మె నోటీసు ఇచ్చిన‌ప్ప‌టి క‌న్నా ముందు నుంచే ఆర్టీసీ కార్మికులు స‌మ్మెబాట ప‌ట్టేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నా కేసీఆర్ నిమ్మ‌కు నీరేత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ప‌రిస్థితి చేదాటి పోయింది.

చివ‌రి ద‌శ‌లో ఐఎఎస్‌ల‌తో ఓ క‌మిటీని నియ‌మించ‌డం, కార్మిక సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా కూడా అవి కొలిక్కి రాక‌పోవ‌డంతో స‌మ్మె అనివార్య‌మైంది. అయితే సీఎం కేసీఆర్ పేరుకు మాత్ర‌మే ఐఏఎస్‌ల‌తో క‌మిటీ వేసిన‌ప్ప‌టికి తానే అంతా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే చ‌క్రం తిప్పాడ‌ని, కానీ ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో ఒప్పుకునేది లేద‌ని ఐఏఎస్‌ల ద్వారా చెప్పించ‌డంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయ‌కులు వెనక్కి త‌గ్గేది లేద‌ని, మా డిమాండ్ల సాధ‌న‌కు స‌మ్మె త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించార‌ట‌.. దీనికి ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసుకోండి అన‌డంతో ఆర్టీసీ కార్మికులు ఇక లాభం లేద‌ని తెలంగాణ స‌ర్కారుతో తాడో పేడో తేల్చుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ముందడుగు వేశార‌ట‌..

అయితే స‌మ్మె చేయ‌లేరని, ఎస్మా ప్ర‌యోగిస్తే కార్మికులంతా చ‌చ్చిన‌ట్లుగా వ‌చ్చి విధుల్లో చేరుతార‌ని ముందుగా ఊహించిన సీఎం కేసీఆర్ కు కార్మీక సంఘాలు ఎదురుదెబ్బ కొట్టార‌ట‌. ఏపీలో ఆర్టీసీని కార్మిక సంఘాలు అడుగ‌కున్నా సీఎం జ‌గ‌న్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డ‌మే కాకుండా, కార్మికులంద‌రిని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప్ర‌క‌టించారు. ఇదే డిమాండ్‌ను నెత్తికెత్తున్న ఆర్టీసీ కార్మికులు ఎలాగైనా తమ‌ను కూడా ఆదుకోవాల‌ని కేసీఆర్‌కు మొర‌పెట్టుకున్నా ప్ర‌యోజనం లేక‌పోవడంతో ఇదే స‌రైన స‌మ‌యం అని గ్ర‌హించిన కార్మిక సంఘాల నేత‌లు స‌మ్మెకు నోటీసులు ఇవ్వడం, స‌మ్మెను కొన‌సాగించ‌డం, దీనికి కేసీఆర్ ఆగ్ర‌హించి డెడ్‌లైన్ ఇవ్వ‌డం, దీనికి ఆర్టీసీ యూనియ‌న్లు ఎంత‌కైనా సిద్ద‌మేన‌ని ప్ర‌క‌టించ‌డంతో స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు.

ఇక లాభం లేద‌ని గ్ర‌హించిన తెలంగాణ సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పుడు ప్ర‌గ‌తిభ‌వ‌న్ కేంద్రంగా ఆర్టీసీ ఉద్య‌మంపై ఆప‌రేష‌న్ ఆర్టీసీ కి సిద్ద‌మ‌య్యారు. ఆదివారం ఆర్టీసీ కార్మికుల స‌మ్మే, దాని ప‌ర్య‌వ‌సానాలపై చ‌ర్చించేందుకు ర‌వాణా శాఖ‌, పోలీసు శాఖ‌, సంబంధిత ఐఎఎస్ అధికారుల‌తో స‌మావేశం నిర్వహించేందుకు కేసీఆర్ స‌న్న‌ద్ద‌మ‌య్యారు. అంటే ఆదివారం రోజున ఆర్టీసి కార్మికుల భ‌విష్య‌త్‌, ఆర్టీసీ బ‌స్సుల ర‌వాణా భ‌విత‌వ్యం తేల‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news