ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సాధారణ పౌరులు కూడా ఈజీగా తెలుసుకునేందుకు రూపొందించిన చట్టం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ). కానీ దీన్ని కొంతమంది సిల్లీ పనుల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబగిలు మండలంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?
మన మండలం మహిళా తహసీల్దార్‌కు ఎన్నిసార్లు పెళ్లయింది? ఆమె ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నారు? ప్రస్తుతం ఆమె భర్త ఎవరు? ఆమెకు పెళ్లి ఎక్కడ జరిగింది? వివాహ ధ్రువపత్రం, కల్యాణ మండపం వివరాలు ఇవ్వగలరు! గతంలో ఆమెను పెళ్లాడిన వారు విడిచిపెట్టడానికి కారణాలేంటి? వారంతా ఏ శాఖల్లో పని చేస్తున్నారు? భర్తలు అందరూ ఆమెకు విడాకులు ఇచ్చారా లేదా? ఇలాంటి పిచ్చి ప్రశ్నల కోసం మండికల్ నాగరాజ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు.
సమాచార హక్కు చట్టం కార్యకర్తగా ములబగిలు మండలంలో ప్రాచుర్యం పొందిన నాగరాజ్ ములబగిలు మండలానికి తహసీల్దార్‌గా చేస్తున్న మహిళపై గురిపెట్టాడు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం అంతా సత్వరమే అందించాలని సహ చట్టం కింద దరఖాస్తు చేశాడు. నాగరాజ్ దరఖాస్తును తీవ్రంగా పరిగణించారు మహిళా తహసీల్దారు. ములబగిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం జుడీషియల్ కస్టడీకి తరలించారు.