రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 11న ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తొలి డోసును తన కుమార్తెకు ఇప్పించానని, ఆమె ఆరోగ్యంగానే ఉందని కూడా పుతిన్ తెలిపారు. అక్టోబర్‌లో అక్కడి ప్రజలకు వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఇవ్వనున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు, సైంటిస్టులు, వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంంబంధించిన ఫలితాల పత్రాలను బయటకు విడుదల చేయకపోవడం, కేవలం 76 మందిపైనే ట్రయల్స్ చేపట్టడం.. తదితర అనేక కారణాల వల్ల రష్యా వ్యాక్సిన్‌ను నమ్మలేమని చాలా మంది అన్నారు. అయితే ఇందుకు మాస్కోలోని మాస్కో సిటీ హాస్పిటల్ అనస్థీషియాలజీ అండ్ రీససియేషన్ విభాగం డిప్యూటీ హెడ్ సెర్గెయ్ త్సరెంకో స్పందిస్తూ.. తమ వ్యాక్సిన్ నమ్మదగినదేనన్నారు. కరోనా వైరస్‌పై తమ వ్యాక్సిన్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందన్నారు. గమాలియా రీసెర్చి ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యంత శక్తివంతమైందని తెలిపారు.
స్పుత్‌నిక్ V వ్యాక్సిన్ కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందని త్సరెంకో తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చాక కొద్ది రోజులకు కరోనాను ఎదుర్కొనగల యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయని.. అయితే వాటికి బూస్టింగ్ అందించడం కోసం రెండోసారి డోస్ కూడా వేయాలన్నారు. తమ వ్యాక్సిన్ పట్ల మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని, అది పూర్తిగా సురక్షితమేనని తెలిపారు.