ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనను విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని, హింసతో ఏమీ సాధించలేరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. దాడుల సంస్కృతి మంచిది కాదని నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోని ప్రజా జీవితంలోకి తిరిగి క్షేమంగా రావాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా, ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. వ్యాపార సంస్థలు, దుకాణాలు, పాఠశాలలు, మార్కెట్లు స్వచ్ఛందంగా మూసివేశారు.
అంతే కాక , మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల గూడ చందన చెరువు దగ్గర మార్నింగ్ వాకర్స్‌తో ప్రచారం మొదలుపెట్టారు సబితా ఇంద్రారెడ్డి. ఈసందర్భంగా సబిత మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కేటీఆర్ గారికి దక్కుతుందన్నారు. చెరువులపై ఎంత ఖర్చు చేసినా వెనకాడకుండా నిధులు విడుదల చేసిన మంత్రి కేటీఆర్ గారికి మరోసారి కృతజ్ఞత తెలిపారు.. మరోసారి మహేశ్వరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని వాకర్స్‌ని కోరారు.